నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం.. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్

  • ఛత్రపతి శంభాజీనగర్‌లో కుటుంబంతో తలదాచుకున్న నిదాను పట్టుకున్న పోలీసులు
  • సహోద్యోగిని మతం మారాలని ఒత్తిడి చేశారన్న ఆరోపణలపై విచారణ
  • ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిదా ఖాన్ హెచ్‌ఆర్ మేనేజర్ కాదని, ప్రాసెస్ అసోసియేట్ అని స్పష్టం చేసిన టీసీఎస్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాసిక్ టీసీఎస్ 'మతమార్పిడి' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలపై పలు కేసులు నమోదు కావడంతో కొంతకాలంగా ఆమె పరారీలో ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం గత నాలుగు రోజులుగా ఛత్రపతి శంభాజీనగర్‌లోని నారేగావ్ ప్రాంతంలోని కైజర్ కాలనీలో ఉన్న ఒక ఫ్లాట్‌లో నిదా ఖాన్ తన తల్లిదండ్రులు, సోదరుడు, అత్తతో కలిసి తలదాచుకుంటోంది. రెండు రోజులుగా ఆ ఫ్లాట్‌పై నిఘా పెట్టిన నాసిక్ సిట్, ఛత్రపతి శంభాజీనగర్ పోలీస్ కమిషనరేట్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ఆమెను జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ పొందారు. తదుపరి విచారణ నిమిత్తం నాసిక్‌కు తరలించారు.

కేసు నేపథ్యం ఏమిటి?
టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఒక మహిళ, తన సహోద్యోగి అయిన దానిశ్‌ షేక్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, కానీ అతనికి అప్పటికే వివాహమైందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. నిందితుడు దానిశ్‌ షేక్ సోదరే ఈ నిదా ఖాన్. బాధితురాలి మతాన్ని కించపరుస్తూ, ఇస్లాం మతంలోకి మారాలని నిదా ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దానిశ్‌కు అప్పటికే పెళ్లయిన విషయాన్ని నిదాతో పాటు మరో ఉద్యోగి తౌసిఫ్ అక్తర్ కూడా దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసు విచారణ ప్రారంభమయ్యాక, మరో ఏడుగురు మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చి తమ సీనియర్లు మానసికంగా, లైంగికంగా వేధించారని, హెచ్‌ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి మధ్య ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటివరకు హెచ్‌ఆర్ హెడ్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు.

కాగా, అరెస్ట్‌కు ముందు నిదా ఖాన్ తాను రెండు నెలల గర్భవతినని పేర్కొంటూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ నాసిక్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వివాదం వెలుగులోకి రావడానికి మూడు నెలల ముందే ఆమెను నాసిక్ నుంచి ముంబైలోని మలాడ్, హిరానందాని కార్యాలయాలకు బదిలీ చేసినట్లు సమాచారం.

ఆరోపణల నేపథ్యంలో నిదా ఖాన్‌ను సస్పెండ్ చేసినట్లు ఏప్రిల్ 9న కంపెనీ లేఖ ఇచ్చింది. ఆమె కంపెనీ అంతర్గత వ్యవస్థలను యాక్సెస్ చేయకుండా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. అయితే, నిదా ఖాన్ హెచ్‌ఆర్ మేనేజర్ కాదని, ఎలాంటి నాయకత్వ బాధ్యతల్లో లేని ఒక సాధారణ 'ప్రాసెస్ అసోసియేట్' అని, ఈ విషయంపై తమ అంతర్గత విభాగాలకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ 'ఎక్స్' వేదికగా స్పష్టం చేసింది.

Nida Khan
Nasik TCS case
Religious conversion
TCS employee arrest
Maharashtra police
Forced conversion case
Sexual harassment case
Crime branch
TCS Nasik
Data Sheikh

More Telugu News